ముత్యమల్లె అతను ఓ మాట మాట్లాడుతాడు
అతడి మాటల్లో వేకువజాము తొంగి చూసిందో
కొండ గాలి వచ్చి అల్లుకుందో గాని
ఆకాశం కొత్త రంగులు అద్దుకున్నట్టు
మెరిసే తారలేవో నేల రాలినట్టు
నాలోని నేను విడిపోతున్నాను
ముక్కలు ముక్కలుగా లెక్కకు అందనంతగా....
రాలిన ముక్కలు
కొండ శిఖరంపై చలిమంట వేసుకునే మిణుగురులై
సముద్రపులో లోతుల్లో స్నానమాడుతున్నాయి....
దారి తప్పిన ముక్కలు చీకటి గుహలోన గబ్బిలాలై
అగ్నిపర్వతపు అంచున నాట్యమాడుతున్నాయి...
నాలోని నాతో ఎంత పంతమో
అతనిలో నేను కరిగిపోతున్నానో
నాలోకి నేను ఇంకిపోతున్నానో
తెలుసుకోవాలని లేదు...
ఇంతకీ
ఎవరివోయ్ నువ్వు
మకరందంలో మునిగి వచ్చావా
వెన్నెల కాంతుల్లో తడిసి వచ్చావా
అకాల వర్షంలా
హోళీ రంగులు చల్లివెళ్తావు...
ఓయ్
ఆకాశమంత ప్రేమిస్తున్నానని
నాపై తంత్రవిద్య ప్రయోగించడంలేదు కదా
ఓయ్....నిజం చెప్పు... ఏమంటావ్